Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 71

Janaka narrates his family lineage !!

|| om tat sat ||


ఏవం బ్రువాణం జనకః ప్రత్యువాచ కృతాంజలిః |
శ్రోతుమర్హసి భద్రం తే కులం నః పరికీర్తితమ్ ||

"ఈవిథముగా పలికిన వానికి ( వసిష్ఠునికి) అంజలి ఘటించి జనకుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. "మీకు శుభమగు గాక . కీర్తిపొందిన మా వంశ చరిత్ర మీరు వినుదురు గాక."

బాలకాండ
ఏకసప్తతితమ
( జనక మహారాజు మిథిలాధిపతుల వంశ చరిత్ర చెప్పుట)

వశిష్ఠ మహాముని రామలక్ష్మణుల వంశ చరిత్ర చెప్పిన పిమ్మట జనక మహారాజు వసిష్ఠునికి అంజలి ఘటించి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. "ఓ బ్రహ్మర్షీ ! మీకు శుభమగు గాక . కీర్తిపొందిన మా వంశ చరిత్ర కూడా మీరు వినుదురు గాక ."

"ఓ మునిశ్రేష్ఠ ! కులాధిపతి కన్యా దానమిచ్చునప్పుడు శేషములేకుండా తన వంశ చరిత్రను వ్యక్తపరచవలెను గదా. పరమధరాత్ముడు మూడు లోకములలోనూ తన కార్యములచేత ప్రశిద్ధికెక్కినవాడు , బలముకలవారిలో బలిష్ఠుడు అగు నిమి మహారాజు మావంశమునకు మూలపురుషుడు. అయన పుత్త్రుడు మిథి అను పేరుగలవాడు. అయన చేత మిథిలానగరము నిర్మించబడినది. ఆయన మొదటి జనకుడు అను పేరుగలవాడు. జనకునకు ఉదావసుడు కలిగెను".

"ఉదావసునకి పుట్టెను దర్మాత్ముడగు నందివర్థనుడు. నందివర్థనుని పుత్త్రుడు సుకేతుడు అని పేరు గలవాడు. సుకేతునుకి ధర్మాత్ముడు మహాబలవంతుడు అగు దేవరాతుడు పుట్టెను. దేవరాతునకు రాజర్షి అగు బృహద్రధుడు కలిగెను. బృహద్రధునికి శూరుడు మహాప్రతాపము గల మహావీరుడు అనుపుత్రుడు కలిగెను. మహావీరునకు సత్యము పాలించు సుధృతి అను సుతుడు పుట్టెను. సుధృతి కి కుడా దృష్ఠకేతు అనబడు సుధార్మికుడు కలిగెను. దృష్ట కేతునకు రాజర్షి అగు హర్యస్వుడు కలిగెను. హర్యస్వుని పుత్త్రుడు మరు. మరుని పుత్రుడు ప్రతింధిక అనబడు వాడు. ప్రతింధకుని పుత్త్రుడు కీర్తిరథుడు అనబడువాడు. కీర్తిరథుని పుత్త్రుడు దేవమీఢుడు. దేవమీఢునిపుత్రుడు విబుధుడు. విబుధుని పుత్రుడు మహీద్రకుడు. మహీద్రకుని పుత్రుడు మహాబలుడు అగు రాజా కీర్తిరాతుడు. కీర్తిరాతునికి రాజర్షి అగు మహారోముడు పుట్టెను. మహారోముని పుత్రుడు స్వర్ణరోముడు. స్వర్ణరోముని పుత్రుడు హ్రస్వరోముడు".

"ఆ ధర్మజ్ఞుడగు హ్రస్వరోమునకు కి ఇద్దరు పుత్త్రులు. అ అనుజులలో నేను జ్యేష్ఠుడను. నా తమ్ముడు కుశధ్వజుడు".

"నరాధిపుడైన నా తండ్రి నాకు రాజ్యము పట్టాభిషేకము చేసి కుశధ్వజుని భారము అప్పగించి వనమునకు పోయెను. వృద్ధుడైన నాతండ్రి స్వర్గస్తులు అయినప్పుడు రాజ్యమును ధర్మబద్ధముగా చేయుచుంటిని. తమ్ముడగు అ కుశధ్వజుని స్నేహపూర్వకముగా చూచుచుంటిని.
పిమ్మట కొంతకాలము తరువాత వీరుడగు సుధన్వుడు మిథిలానగరమునకు ప్రతిబంధకములు కలిగించుటకు సాంకశ్యనగరము నుంచి వచ్చెను. అతడు నా ఉత్తమమైన శివ ధనస్సును , పద్మాక్షి అగు సీతను తనకి ఇవ్వమని వార్త పంపెను. ఓ బ్రహ్మర్షీ ! తనకి ఇవ్వని కారణమువలన నాతో యుద్ధమునకు వచ్చెను. ఆ రాజు యుద్ధములో నా ఎదుట రణములో చనిపోయెను. ఓ మునిశ్రేష్ఠ ! ఆ నరాధిపుడగు సుధన్వుని సంహరించి సాంకాశ్యనగరమునకు సోదరుడు వీరుడగు కుశ ధ్వజుని పట్టాభిషిక్తుని చేసితిని".

"ఓ మహామునీ ! ఇతడు నాతమ్ముడు. నేను పెద్దవాడిని. సీతను రామభద్రునకు ఊర్మిళను లక్ష్మణునకు ఇచ్చెదను. ఓ మునిపుంగవ మీకు మంగళమగు గాక . సురలతో సమానమగు వీర్య శుల్కమగు నాకూతురు సీతని , రెందవది ఊర్మిళను అని మూడు సార్లు చెప్పుచున్నాను. సందేహము లేదు. ఓ రాజన్ ! రామలక్ష్మణులచేత గోదాన క్రియను జరిపించుడు. తండ్రి వివాహమునకు సంభంధించిన చేయవలసిన కార్యములు కూడా చేయుడు. ఈ దినము మఖ నక్షత్రము. ఓ మహాబాహో మూడవ దినము ఉత్తర ఫల్గుణి. అందు వివాహము చేయుడు. రామలక్ష్మణుల సుఖము కొఱకు దానకర్మలను చేయుడు".

ఈ విధముగా దెబ్బది ఒకటవ సర్గ సమాప్తము

సమాప్తం ||

||ఓమ్ తత్ సత్ ||

ఫల్గునా ముత్తరే రాజన్ తస్మిన్ వైవాహికం కురు |
రామలక్ష్మణయోరాజన్ దానం కార్యం సుఖోదయమ్ ||

" ఉత్తర ఫల్గుణి నక్షత్రమునందు వివాహము చేయుడు. రామలక్ష్మణుల సుఖము కొఱకు దానకర్మలను చేయుడు".

|| ఓం తత్ సత్||

 

 

 

 

||om tat sat ||